అమరావతిలో చంద్రబాబు ఇల్లునూ కూల్చేస్తారా?

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో నివసిస్తున్న ఇంటిని కూడా కూల్చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించిన ప్రజావేదికను అక్రమ కట్టడంగా నిర్ణయించిన ప్రభుత్వం దాన్ని కూల్చివేసింది. ఇప్పుడు దానికి పక్కనే ఉన్న చంద్రబాబునాయుడు నివాసాన్ని కూడా కూల్చేస్తామని అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. చంద్రబాబు ఇల్లు నదికి మరింత దగ్గరగా ఉందని, ప్రజావేదికలాగే ఇది కూడా అక్రమ నిర్మాణమేనని ఆయన అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి ఉన్న ఇల్లు అక్రమ నిర్మాణం. దానిపై టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిని కూల్చివేయాలని పోరాటం చేశారు. ఆ భవనానికి అనుమతులు, ప్లాన్ ఉన్నాయా? దానికి ఏమీ లేవు. అక్రమ నిర్మాణంలో ఉంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇల్లు ఖాళీ చేస్తే గౌరవంగా ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అక్రమ నిర్మాణం అయిన ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా ప్రభుత్వం గట్టి సంకేతాలు పంపింది. తర్వాత చంద్రబాబు నివాసాన్ని కూడా కూల్చేస్తామనే సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు.