HomeTelugu Big Storiesఅమరావతి రైతులకు అండగా ఉంటానన్న పవన్

అమరావతి రైతులకు అండగా ఉంటానన్న పవన్

7 14
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు 60 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. రాజధానిని తరలించొద్దంటూ 29 గ్రామాల్లో రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ రోడ్డుపైకి వచ్చి రైతులు, మహిళలు, చిన్నారులు సహా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇప్పటికే రాజధాని రైతుల ఆందోళనలకు వివిధ పార్టీల నుంచి మద్దతు లభించింది. ఏపీ సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. పవన్ కల్యాణ్‌తో తమ గోడును చెప్పుకుని రాజధాని మహిళలు కన్నీరుపెట్టుకున్నారు. రాజధాని కోసం పంటపొలాలు ఇచ్చి రోడ్డుమీదకు వచ్చేశామని, మా బతుకులు అగమ్యగోచరంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. 60 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదని, తమ ఆవేదనను అర్ధం చేసుకోవడం లేదని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, 3 రాజధానులు వద్దని డిమాండ్ చేశారు.

రాజధాని రైతుల కష్టాలు చూసి చలించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కానీ అమరావతి రాజధానిగా ఉండాలని గత ప్రభుత్వం, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అంగీకరించిందని అన్నారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. రాజధాని రైతులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నమ్మించి గొంతు కోశారని పవన్ మండిపడ్డారు. ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొన్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా పోరాటం చేస్తానన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రైతులు భూములిచ్చారు. రాష్ట్రానికి అమరావతే రాజధాని అని నిర్ణయం తీసేసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు మార్చడానికి లేదు. 151 మంది ఎమ్మెల్యేలు మార్చుకుంటాం.. 13 రాజధానులు.. 13 ముక్కలు.. 33 ముక్కలు చేస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం.. తమ ఇష్టానికి చేసుకోవడం కుదరదు అని అన్నారు.

”రాజధాని తరలింపు అంశాన్ని జగన్‌ ఎన్నికల ముందే చెప్పి ఉండాల్సింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. నాలుగైదు భవనాలు కట్టినంత మాత్రాన అభివృద్ధి కాదు. రైతులు టీడీపీకి భూములు ఇవ్వలేదు అప్పటి ప్రభుత్వానికి ఇచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నా. ఒక్క కోర్టు వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

విశాఖలో మళ్లీ భూసమీకరణ చేస్తున్నారు. అక్కడి రైతులు భూసమీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు ఉంటే విశాఖలో మళ్లీ భూ సమీకరణ ఎందుకు? ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నట్లు ఉందని మండిపడ్డారు. అమరావతిలో చాలా రోజులుగా కులమతాలకతీతంగా రైతులు దీక్షలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినది కాదు. రైతులు నిజంగా త్యాగం చేసి భూములు ఇచ్చారు. టీడీపీతో మీకు గొడవలు ఉంటే వారితో పెట్టుకోండి.. రాజధాని మార్చుతూ ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. రాజధాని కోసం 40 మందికి పైగా రైతులు చనిపోయారు.. ఇవి ప్రభుత్వ హత్యలే. అహంకారం తలకెక్కి నిర్ణయాలు తీసుకుంటే మంచిది కాదు. అమరావతి రైతుల ఉద్యమానికి నా మద్దతు ఎప్పటికీ ఉంటుంది అని పవన్‌ స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu