ఈ ఏడాదిలో స్టార్ హీరోయిన్ల పాత్ర!

ఒకప్పుడు తెలుగు సినిమాలో స్టార్ హోదా దక్కాలంటే కనీసం వరుసగా మూడు హిట్స్ అయినా.. పడాల్సిందే.. అప్పుడు కానీ స్టార్ హీరోయిన్ అనేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. రాత్రికి రాత్రే స్టార్ హోదా వచ్చేస్తుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండడంతో హిట్ ఇచ్చిన బ్యూటీతోనే పని చేయాలని దర్శకనిర్మాతలు కూడా కోరుకుంటున్నారు. హీరోలది సైతం అదే తంతు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్ర తక్కువే ఉన్నా.. మాస్ ఆడియన్స్ మాత్రం వారిని చూడడానికే థియేటర్ కు వస్తుంటారు. మరి మన ఇండస్ట్రీలో స్టార్ నాయికలుగా చెలామణి అవుతోన్న సుందరిలు ఈ ఏడాది తమ హవాను ఎంతవరకు చాటారో ఇప్పుడు తెలుసుకుందాం..

తెరపై గ్లామర్ పండించాలన్నా.. కత్తి యుద్దాలు చేయాలన్నా.. అనుష్క తరువాతే ఎవరైనా. అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. అయితే ఈ ఏడాది మాత్రం అమ్మడు తన అభిమానులను నిరాశ పరిచిందనే చెప్పాలి. అనుష్క హీరోయిన్ గా నటించిన ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో మాత్రమే మెరిసింది. ఆమె నటించిన ‘సింగం 3’ ఈ నెలలోనే విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. దీంతో ఈ సంవత్సరం అమ్మడు తన క్రేజ్ ను పెద్దగా చూపలేకపోయింది. మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా ఈ సంవత్సరం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ‘ఊపిరి’, ‘అభినేత్రి’ వంటి సినిమాల్లో కనిపించింది తమన్నా. ‘ఊపిరి’ క్రెడిట్ మొత్తం నాగార్జున, కార్తీ ల ఖాతాలోకి చేరిపోవడంతో అమ్మడుకి పెద్దగా కలిసొచ్చింది లేదు. ఇక ఎన్నో ఆసలతో నటించిన ‘అభినేత్రి’ సినిమా కూడా అంతంత మాత్రంగా మిగిలిపోయింది. రీసెంట్ గా ‘ఒక్కడొచ్చాడు’ అనే డబ్బింగ్ సినిమాతో ఆడియన్స్ ముందు వచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమాలో కేవలం పాటలవరకు మాత్రమే పరిమితమైంది.

ఈ సంవత్సరంలో అతి పెద్ద దెబ్బ తగిలింది కాజల్ కి. ‘బ్రహ్మోత్సవం’,’సర్ధార్ గబ్బార్ సింగ్’ సినిమాలు కాజల్ ను చీకట్లోకి నెట్టేశాయి. ఎన్టీఆర్
‘జనతాగ్యారేజ్’ లో మాత్రం ‘నేను పక్కా లోకల్’ అంటూ ఐటెమ్ సాంగ్ లో మెరిసి ఆకట్టుకుంది. కాజల్ కు కాస్తో.. కూస్తో.. ఈ పాట మాత్రం ఊరటనిచ్చింది. సమంత మాత్రమే ఈ ఏడాది బెటర్ రిజల్ట్ ను అందుకుంది. తను నటించిన ‘జనతా గ్యారేజ్’,’24’,’అ ఆ’ సినిమాలు హిట్స్ గా నిలిచాయి. ‘అ ఆ’ సినిమాలో ఈ బ్యూటీ పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. అంతగా తన నటనతో మెస్మరైజ్ చేసింది. శృతిహాసన్ మాత్రం ఈ ఏడాది ‘ప్రేమమ్’ ఒక్క సినిమాలోనే నటించింది. దాంతో అమ్మడుకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిన రకుల్ మాత్రం ఈ ఏడాది మూడు హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. వచ్చే ఏడాది వీరు మరిన్ని హిట్స్ తమ ఖాతాలో వేసుకోవాలని ఆశిద్దాం!