నా బాధ్యతలు మోసే వ్యక్తి ఇకలేరు: అమితాబ్‌ బచ్చన్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్.. తన బాధ్యతలు మోసిన వ్యక్తి ఇకలేరంటూ ఓ భావోద్వేగపు సందేశాన్ని పోస్ట్‌ చేశారు ‌. 40 ఏళ్లుగా తనకు మేనేజర్‌గా పనిచేసిన శీతల్‌ జైన్‌ అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. అతని అంత్యక్రియల కార్యక్రమంలో అమితాబ్‌తో పాటు ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బి శీతల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘దాదాపు 40 ఏళ్ల పాటు నిజాయతీగా నా వృత్తికి సంబంధించిన బాధ్యతలను శీతల్‌ తన భుజంపై మోశారు. ఇప్పుడు ఆయన మృతదేహాన్ని నేను మోశాను. నా కష్టసుఖాలను శీతల్‌ సమానంగా పంచుకున్నారు. ఇప్పుడు అతని 40 ఏళ్ల జీవితం నా కళ్ల ముందు మెదులుతోంది. ఇంట్లో మనిషి వెళ్లిపోయినట్లుగా ఉంది. వృత్తిపరంగా మా కుటుంబానికి ఎలాంటి సమస్యలు రానివ్వకుండా చూసుకున్నారు. నేను చేయాల్సిన సినిమాలు, పాల్గొనాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఏదన్నా కార్యక్రమంలో మా కుటుంబంలో ఏ ఒక్కరూ పాల్గొనలేకపోతే మా తరఫున ఆయన వెళ్లేవారు. చాలా సింపుల్‌ మనిషి. ఇప్పుడు నా కార్యాలయంలో ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది’ అని పేర్కొన్నారు అమితాబ్‌.

1998లో అమితాబ్‌ నటించిన ‘బడే మియా చోటే మియా’ సినిమాకు శీతల్‌ నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమా ఆ ఏడాదిలోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.