పవన్‌ కల్యాణ్‌ సినిమాలో కీలక పాత్రలో అనసూయ


హాట్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు వరుసగా మెగా ఆఫర్లు తన్నుకొస్తున్నాయి. గతంలో అనసూయ ‘క్షణం’, ‘రంగస్థలం’ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. ‘కథనం’ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానుల ఆదరణ పొందింది. ఎలాంటి పాత్రలోనైనా నటించే సత్తా ఉందని నిరూపించుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

పవన్ కల్యాణ్ క్రిష్ జగర్లమూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఆమె పాత్ర అరగంట సేపే ఉన్నప్పటికీ సినిమాకు చాలా కీలకం అని ఫిలిం వర్గాల సమాచారం. అనసూయ కోసం ఓ పాట కూడా చేయబోతున్నారట. ఇందులో పవన్ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు కూడా లీకైపోతున్నాయి. నిన్ననే పవన్ కల్యాణ్‌ సినిమాకు సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది.