బాలయ్య లవ్ ఫెయిల్యూర్ స్టోరీ!

నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘పైసా వసూల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ హీరోలతో పోటీగా మరి ఈ సీనియర్ హీరో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ‘పైసా వసూల్’ షూటింగ్ పూర్తయిన వెంటనే బాలయ్య.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కుంభకోణంలో జరుగుతోంది. దాదాపు నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ జరపనున్నారు. కథలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతుందనే విషయం ఆరా తీయగా.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాలో బాలయ్య 40 ఏళ్ల బ్రహ్మచారి పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు. 
హీరో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడానికి కారణం కూడా ఉందని తెలుస్తోంది. ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడిపే ఓ వ్యక్తిగా బాలయ్య కనిపించబోతున్నాడు. మరొకరిని పెళ్లి చేసుకున్న ఆమె తిరిగి మళ్ళీ అతడి జీవితంలో ప్రవేశిస్తే ఏం జరిగిందన్నదే సినిమా కథ అని సమాచారం. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.