బాలకృష్ణ 105వ చిత్రం షూటింగ్ ప్రారంభం


నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. తమ అభిమాన కథానాయకుడి కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్న వారికోసం కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 105వ చిత్రంలో తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశానికి వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

బాలకృష్ణ నటించే 105వ చిత్రం ఎవరి దర్శకత్వంలో చేస్తారనేదానిపై గత కొంత కాలంగా చర్చ నడుస్తోంది. కేఎస్‌ రవికుమార్‌ సినిమా ఒకే అయినా, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దానిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం షూటింగ్‌ ప్రారంభం కావడంతో అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ జైసింహా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను అందుకుంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. జులై నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్లు, ఇతర పాత్రల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.