నాకు రోజు రోజుకూ వయసు తగ్గుతోంది: బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తన వయసు రోజు రోజుకూ తగ్గుతోందంటున్నారు. సోమవారం ఆయన తన 59వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో బాలయ్య పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. క్యాన్సర్‌ బాధిత చిన్నారులతో కలిసి ఆయన కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య వేదికపై మాట్లాడుతూ.. ‘నన్ను అప్పుడే కొందరు విష్‌ చేశారు. దానికి నేను ‘మీకు వయసు పెరుగుతోందేమో కానీ, నాకు వయసు తగ్గుతోంది. ఆ రకంగా విష్‌ చేయండి (వయసు తగ్గుతోందనే అర్థం వచ్చేలా)’ అని చెప్పా. తన కుటుంబానికి, ప్రాంతానికి, ఊరికి, రాష్ట్రానికి ఎవడైతే పేరు తీసుకొస్తాడో.. వాడిని అందరూ గుర్తు పెట్టుకుంటారు. అలా మనం అందరి మనసులో నిలిచిపోవాలి. అలాంటి జన్మకు ఓ అర్థం ఉంటుంది. మా నాన్న సమాజానికి చేసిన సేవ చూసి ఇవన్నీ నేను నేర్చుకున్నా. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. అందరూ కలిసి పనిచేస్తేనే విజయం సాధ్యం అవుతుంది. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి అండగా ఉన్న ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని అన్నారు.

ఈ సందర్భంగా బాలయ్యకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. బాలయ్య మంచి మనసును కొనియాడారు. పరుచూరి గోపాలకృష్ణ, మంచు మనోజ్‌, ఛార్మి, హంసా నందిని తదితరులు సోషల్‌మీడియా వేదికగా విష్‌ చేశారు.