HomeTelugu Newsవైద్యులపై దాడికి పాల్పడుతున్న కరోనా బాధితులు

వైద్యులపై దాడికి పాల్పడుతున్న కరోనా బాధితులు

8 1

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందడంతో అతడి బంధువులు ఓ వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులపై దాడిచేయడాన్ని ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు జరుగుతున్నాయి.

రోజు రోజుకూ దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా బాధితులకు చికిత్స అందించడం డాక్టర్లకు సవాలుగా మారింది. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తుంటే పేషెంట్లు తమపై దాడికి దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అతనితో సన్నిహితంగా ఉన్నవారిని సైతం పరీక్షించగా మరో ముగ్గురికి కరోనా సోకినట్లు తేలింది. ఇందులో ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తి చనిపోయాడు. చికిత్స సరిగా అందించలేదని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు తమపై దాడికి దిగారంటూ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక భద్రత కల్పిస్తేనే వైద్యసేవలు అందిస్తామని సూపరింటెండెంట్‌కు వినతి పత్రమిచ్చారు.

వైద్యులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇవాళ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులపై దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu