అలాంటి సినిమా తీసి నేనేమన్నా తప్పుచేశానా? : కంగనా

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమాలోని ‘వఖ్రా స్వాగ్‌’ అనే పాటను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కంగన మీడియా వర్గాలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఓ విలేకరి కంగనను సినిమా గురించి ప్రశ్నిస్తుండగా మధ్యలో ఆమె కలగజేసుకుని.. ‘మీరు నేను నటించిన ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ సినిమా గురించి అలా రాయడం తప్పని అనిపించడం లేదా? అలాంటి సినిమా తీసి నేనేమన్నా తప్పుచేశానా? నా గురించి అలా ఇష్టమొచ్చినట్లు ఎలా రాసేస్తారు?’ అని అడిగారు.

ఇందుకు సదరు విలేకరి సమాధానమిస్తూ.. ‘నేనెప్పుడు మీ గురించి అలా రాశాను? మీరు టాప్‌ హీరోయిన్‌ అయినంతమాత్రాన ఓ విలేకరిని ఇలా బెదిరిస్తున్నట్లుగా మాట్లాడటం సరికాదు’ అన్నారు. ఇందుకు కంగన ప్రతిస్పందిస్తూ.. ‘మణికర్ణిక’ సినిమా విడుదలయ్యాక నా ఇంటర్వ్యూ కోసం మీరు వచ్చారు. నా వ్యానిటీ వ్యాన్‌లో కూర్చుని మూడు గంటల పాటు ఇంటర్వ్యూ చేశారు. మనమిద్దరం కలిసి భోజనం కూడా చేశాం’ అన్నారు.

దాంతో ఆ విలేకరి షాకయ్యారు. ‘నేనెప్పుడు మిమ్మల్ని మూడు గంటలు ఇంటర్వ్యూ చేశాను? నేనెప్పుడు మీతో కలిసి భోజనం చేశాను?’ అని అడిగారు. అలా ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. మరో విలేకరి గట్టిగా కేకలు వేస్తూ రచ్చ చేయడంతో కంగన క్షమాపణ చెప్పారు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.