జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌ తొలి మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి (76) అనారోగ్యంతో కన్నుమూశారు. నెల రోజులుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఆయన ఏఐజీ ఆస్పత్రిలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని అవంతినగర్‌లోని నివాసానికి తరలించారు. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు సంతాపం తెలిపారు. జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో ఇద్దరు న్యాయవాద వృత్తిలో, మరొకరు ఇంజనీరుగా స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో జన్మించిన సుభాషణ్‌రెడ్డి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం మద్రాస్‌ హైకోర్టు, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు.