నన్ను నిషేధించండి.. కంగనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ దయచేసి నన్ను నిషేధించండి అంటూ పలు మీడియా వర్గాలను వేడుకుంటున్నారు‌. ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ విలేకరికి కంగనకు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. దాంతో ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని, ఆమెను చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించి మున్ముందు మీడియాకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొననివ్వకుండా చేయాలని పలువురు విలేకర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగన సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

‘నేను పలు మీడియా వర్గాలను ఉద్దేశిస్తూ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నాకు మీడియా అన్ని సందర్భాల్లో మద్దతుగా నిలిచింది. మీడియాలో మంచి స్నేహితులు ఉన్నారు. నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వచ్చారు. నా విజయంలో వారి హస్తం కూడా ఉంది. అలాంటివారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొన్ని మీడియా వర్గాలు ఉన్నాయి.. వీరంతా దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్లు పదో తరగతి ఫెయిలై వచ్చినవాళ్లు. ఇలాంటివారిని మన దేశం శిక్షించలేదు’ ‘వీళ్లకు దేశం పట్ల ఎటువంటి భక్తి ఉండదు. కానీ నాకు దేశం పట్ల భక్తిలేదని ఆరోపిస్తుంటారు. పర్యావరణ దినోత్సవం రోజున నేను ఈషా ఫౌండేషన్‌తో కలిసి ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాను. జంతు సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన క్యాంపెయిన్‌లో పాల్గొన్నాను. నేను ఇవన్నీ చేసినందుకు ఓ విలేకరి నాపై జోకులు వేస్తూ ఆర్టికల్‌ రాశాడు. ఇలాంటివాళ్లు విలేకరులం అని ఎలా చెప్పుకొంటున్నారో నాకు అర్థంకావడంలేదు. ఓ విలేకరి నేను చేసిన సినిమా గురించి తప్పుగా రాశాడని అతన్ని నిలదీశాను’

‘దాంతో అక్కడే ఉన్న మరో నలుగురు విలేకర్లు నాపై కేకలు వేశారు. నన్ను నిషేధించాలని ఆందోళన చేశారు. నన్ను సినిమాల్లోకి తీసుకోనివ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటివాళ్లు ఇండస్ట్రీని ఏలుతున్నట్లైతే నేను టాప్‌ నటిని అయ్యేదాన్ని కాదు కదా! మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను. దయచేసి నన్ను నిషేధించండి. ఎందుకంటే నా ద్వారా వచ్చే వార్తలతో మీరు మీ కుటుంబాన్ని పోషించకూడదు’ అని వెల్లడించారు కంగన.