‘కవచం’ రికార్డు.. 24 గంటల్లో కోటి 80 లక్షల వ్యూస్‌

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కవచం’ సినిమా రికార్డు సృష్టించింది. హిందీలో ఈ చిత్రం ‘ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌’ టైటిల్‌తో విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ చిత్రాన్ని కోటి 80 లక్షల మంది వీక్షించారు. అందులోనూ కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఇంత మంది వీక్షించడం విశేషం.
గతేడాది తెలుగులో డిసెంబర్‌ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. కానీ హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. శ్రీనివాస్‌ మామిళ్ల ‘కవచం’ కు దర్శకత్వం వహించారు. తెలుగులో విడుదలయ్యే సినిమాలు దాదాపుగా హిందీలో డబ్బింగ్‌ వెర్షన్స్‌లో విడుదలవుతుంటాయి. స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘సరైనోడు’ సినిమా హిందీలోనూ విడుదలైంది.
యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన డబ్బింగ్‌ చిత్రంగా నిలిచింది. ‘అజ్ఞాతవాసి’, ‘లై’, ‘అ ఆ’, ‘దువ్వాడ జగన్నాథమ్‌’ తదితర సినిమాలు కూడా హిందీ వెర్షన్‌లో విడుదలై రికార్డులు సృష్టించాయి.