బిగ్‌బాస్‌ హౌస్‌లో కౌశల్‌కు క్లాస్‌ పీకిన నాని

తెలుగు బిగ్ బాస్ షో కొద్ది రోజుల్లోనే చివరి దశకు చేరుకుంది. ఇక కొద్ది రోజుల్లో బిగ్‌బాస్‌ హౌస్‌కి స్వస్థి పలకబోతున్నారు మన హౌజ్‌మేట్స్‌. ఈ క్రమంలో కంటెస్టెంట్టే కాదు ప్రేక్షకులు , హోస్ట్‌గా ఉన్న నాని కూడా ఒకింత ఆవేదనకి గురవుతున్నారు. నిన్న (శనివారం) జరిగిన 98వ ఎపిసోడ్‌లో నాని ఇదే విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ఓ పిట్ట కథ చెప్పాడు. ‘ఒక అక్వేరియంలో కొన్ని చేపలు ఉంటాయి. వాటిలో రెడ్ కలర్ చేప అంటే ఆ పిల్లోడికి చాలా ఇష్టం. ప్రతిరోజు ఆ చేపను చాలా ప్రేమించేవాడు. కాని ఆ చేపకు కావాల్సిన ఫుడ్‌ని వేయకుండా ప్రేమతోటే సరిపెట్టేస్తాడు. ఒకరోజు తిండిలేక తనకిష్టమైన చేప చనిపోతుంది’. ఈ కథలో నీతి ఏంటి అంటే.. మనకి ఇష్టమైన వాళ్లు గెలవాలని కోరుకోవడం కాదు.. వాళ్ళకు ఓటు వేసి గెలిపించాలి. వాళ్లు ఎలాగైనా గెలుస్తారులే.. అనుకుని ఓటు వేయడం మానేస్తే.. పరిణామాలు వేరేలా ఉంటాయి అని అన్నాడు నాని.

కాగా హౌస్‌లో తప్పుల గురించి మాట్లాడిన నాని తర్వాత, సరదా విషయాల గురించి ప్రస్తావించారు. ముందుగా రాత్రి సమయంలో గీతా మాధురి కొందరు హౌజ్‌లోకి వచ్చే ముందు అంతా సెట్ చేసుకొని ఇంట్లోకి వచ్చారు అనే విషయాన్ని సామ్రాట్‌, దీప్తిలతో చర్చించింది. దీని గురించి నాని .. గీతామాధురితో ఎవరో అంతా సెట్ చేసుకొని వచ్చారు అనే స్టేట్‌మెంట్ ఎలా ఇచ్చారని అడిగాడు. దీనికి సమాధానం ఇచ్చిన గీతా.. తనకు కౌశల్‌, రోల్‌పైన కాస్త అనుమానం ఉందని, గతంలో నూతన్ నాయుడుతో ఈ విషయంలో గురించి మాట్లాడితే ఆయన అవును అన్నట్టుగానే ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం చెప్పాడు. దీంతో ఓ అంచనాకి వచ్చానంటూ గీతా చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి విషయాలేవి తనకు తెలియవు అని కౌశల్ చెప్పాడు. మీరు ఇచ్చే స్టేట్‌మెంట్స్ వలన ప్రేక్షకులకి రాంగ్ మెసేజ్ వెళుతుందని గీతాకి హెచ్చరిస్తూ ఇలాంటి స్టేట్‌మెంట్స్ మరోసారి చేయోద్దని నాని .. గీతాని ఆదేశించాడు.

నిన్న జరిగిన 98వ ఎపిసోడ్ మొత్తంలో కౌశల్‌నే ఎక్కువగా టార్గెట్ చేశాడు నాని. అతను రోల్ రైడాని బూతులు తిట్టడం, సంచాలకుడిగా ఉన్న అతను గేమ్‌ని తప్పుగా అర్ధం చేసుకొని కంటెస్టెంట్స్‌ని తప్పు దారి పట్టించడంతో కౌశల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు నేచురల్ స్టార్‌. ముందుగా రోల్, అమిత్‌లను ఉద్దేశించి మీకు హౌస్‌లో ఉన్నవాళ్లలో ఎవరితో ఎక్కువ ఇబ్బంది ఉన్నదని నాని అడగ్గా.. గీత, కౌశల్ పేర్లు చెప్పాడు. అయితే మీకు వాళ్లతో ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ల ఎదురుగా ఆ విషయాన్ని చెప్పడు. పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. ఎదురుగా మాట్లాడే దమ్ము నీకు లేదా, మంచి అనిపించుకోవడం ముఖ్యం కాదు మంచి కోసం నిలబడటమే ముఖ్యమని అన్నాడు నాని

రోల్ రైడాతో మాట్లాడిన నాని.. ఏదో విషయంలో కౌశల్ నిన్ను ఏదో మాటలు అన్నాడు. ఆ మాటకు బీప్ కూడా వేశారు. ఆ మాట ఏంటని నాని అడగగా అందుకు రోల్ యు ఆర్ మై ***** వాష్ అన్నాడని చెప్పాడు. దీంతో నాని ..ఇదే మాట రోల్‌ని అన్నావా అని కౌశల్‌ని ప్రశ్నించాడు. ఇందుకు కౌశల్ అన్నానని చెప్పడంతో ఇలాంటి బూతు పదం వాడడం నీకు ఎంత వరకు కరెక్ట్ అనిపించింది. ఇదే మాట నిన్ను రోల్ అని ఉంటే ఊరుకునేవాడివా అంటూ కౌశల్‌కి క్లాస్ పీకారు. రోల్‌తో ఉన్న చనువు వలన అలా అన్నాను. కాని తప్పని తెలుసుకొని వెళ్లి సారీ చెప్పాను అని కౌశల్ తను అన్న మాటలకి వివరణ ఇచ్చుకున్నాడు. ఇక క్లాస్‌లు పీకే సెక్షన్ పూర్తి కావడంతో ‘రిమోట్ కంట్రోల్’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌజ్‌లోకి రావడం, వారిని చూసి ఎమోషనల్‌తో పాటు సంతోష పడటం గురించి ప్రస్తావించాడు నాని. ఆ సమయంలో మిమ్మల్ని చూసి మేము కూడా చాలా భావోద్వేగానికి గురయ్యామని అన్నాడు.

ఇక ప్రతి శనివారం ఇంటి సభ్యులలో ఒకరు కాలర్‌తో మాట్లాడే అవకాశం బిగ్ బాస్ కలిపించగా, ఈ వారం ఆ అవకాశం సామ్రాట్‌కి దక్కింది. తెనాలి నుండి సాంబశివరావు అనే వ్యక్తి కాల్ చేసి సామ్రాట్‌తో మాట్లాడారు. అతనిని జెంటిల్‌మెన్‌గా అభివర్ణిస్తూ గేమ్ బాగా ఆడుతున్నారని, తప్పకుండా ఫైనల్‌లో ఉంటారనే విషయాన్ని ప్రస్తావించాడు. ఆ తర్వాత కీలకమైన ఎలిమినేషన్స్ భాగం రాగానే నాని ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ ని చేతులు ఎత్తమని అన్నాడు. దీంతో అమిత్‌, రోల్ రైడా, కౌశల్‌, గీతా మాధురి, దీప్తి చేతులు ఎత్తారు. అయితే వీరిలో ఎవరు ప్రొటెక్టెడ్ జోన్‌కి వెళ్లారనే విషయాన్ని శనివారం ఎపిసోడ్‌లో సస్పెన్స్‌లో పెట్టిన నాని , దీనిపై క్లారిటీ ఆదివారం ఇచ్చి ఒకరిని ఇంటి నుండి సాగనంపుదామని అన్నారు.

కాగా ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ నుండి అమిత్ ఎలిమినేట్ కానున్నాడని చెబుతున్నారు. మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వార్తలో నిజమెంతో తెలుసుకోవాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే.