ఇప్పుడు తెలిసిందా నన్నెందుకు పెళ్లిచేసుకున్నారో!.. నెటిజన్లను ఆకర్షిస్తున్న ఉపాసన ట్వీట్‌

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌.. తన సతీమణి ఉపాసనతో కలిసి దక్షిణాఫ్రికాలో విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉపాసన సింహం పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు తీసిన ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. అయితే ఉపాసన ఈ ఫొటోకు ఇచ్చిన క్యాప్షన్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘ఇప్పుడు తెలిసిందా మీకు మిస్టర్‌ సి (చరణ్‌) నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో! ఆఫ్రికా మాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ప్రకృతిని, జంతువులను గౌరవించాలి. వాటిని కాపాడుకునేందుకు మనవంతు ఏదన్నా చేసే సమయం వచ్చింది. చిన్న పనులు పెద్ద మార్పును తెస్తాయి’ అని పేర్కొన్నారు.

అంటే తనకు సింహం పిల్లలను పట్టుకునేంత ధైర్యం ఉన్నందుకే చరణ్‌ తనను పెళ్లి చేసుకున్నారని ఉప్సీ పరోక్షంగా చెబుతున్నారన్నమాట. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చాక చరణ్‌.. ‘ఆర్‌ ఆర్ ఆర్’ చిత్రీకరణలో పాల్గొంటారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరికీ గాయాలు కావడంతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. త్వరలో సినిమా తర్వాతి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.