‘సర్కార్’కి స్టార్‌ హీరోల మద్దతు

కొన్నిరోజులుగా ‘సర్కార్’ చిత్రం ఎదుర్కొంటున్న వివాదంపై సినీ నటులు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. అన్నాడీఎంకే పార్టీకి వ్యతిరేకంగా సినిమాలో పలు సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీకి చెందిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘సర్కార్’ దర్శకుడు ఏ.ఆర్‌ మురుగదాస్‌ను, చిత్రబృందాన్ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమిళనాడులో ‘సర్కార్’ను ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్లను చించివేస్తున్నారు. దాంతో పోలీసులు థియేటర్ల వద్ద భారీగా బందోబస్తు విధించారు. మురుగదాస్‌ నివాసం వద్ద కూడా భద్రత కల్పించారు. ముందుజాగ్రత్తగా మద్రాస్‌ హైకోర్టులో మురుగదాస్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ వివాదంపై తాజాగా రజనీకాంత్‌ ట్వీట్‌ చేస్తూ..’సెన్సార్‌ బోర్డు సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చాక పలు సన్నివేశాలను తొలగించాలని డిమాండ్‌ చేయడం, పోస్టర్లను చించి ఆందోళన చేయడం సబబు కాదు. అవి అనైతిక చర్యలు. ఈ చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అన్నారు.

కమల్‌ హాసన్‌ స్పందిస్తూ..’సెన్సార్‌ ప్రక్రియ పూర్తిచేసుకున్న ‘సర్కార్’ సినిమా పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ప్రస్తుత ప్రభుత్వానికి కొత్తేం కాదు. విమర్శలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది. కమర్షియల్‌ రాజకీయ నాయకులు ఎప్పటికైనా కనుమరుగైపోవాల్సిందే. మంచి వాళ్లే గెలిచేది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు కమల్‌.

మరో స్టార్ విశాల్‌ కూడా విజయ్‌ ‘సర్కార్ సినిమాకి మద్దతు పలికారు. ‘దర్శకుడు మురుగదాస్‌ ఇంట్లో పోలీసులు..? ఎందుకోసం..? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవనే ఆశిస్తున్నా. సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పటికే చాలా మంది ప్రజలు సినిమా చూశారు. అయినా ఈ గొడవ, ఏడుపు ఎందుకు’ అంటూ ట్వీట్ చేశారు.