తమిళ సినీ పరిశ్రమ ఎన్నికలు, ఓటుకు దూరంగా రజనీ

తమిళ సినీ పరిశ్రమ నడిగర్‌ సంఘానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 3,100 మంది సభ్యులు ఉన్న నడిగర్ సంఘానికి 2019-2022 మధ్య కాలానికి గాను ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మైలాపూర్‌లోని సెయింట్‌ ఎబాస్‌ బాలికల పాఠశాలలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మద్రాస్‌ హైకోర్టు తుది తీర్పు అనంతరం ఫలితాలను
వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో నాజర్‌ నేతృత్వంలోని పాండవార్‌ జట్టు, భాగ్యరాజ్‌ స్వామి నేతృత్వంలోని శంకర్‌దాస్‌ జట్టు బరిలో నిలిచాయి. నడిగర్‌ సంఘం అధ్యక్ష పదవికి పాండవార్‌ జట్టు నుంచి నటుడు నాజర్‌, శంకర్‌దాస్‌ జట్టు నుంచి రచయిత భాగ్యరాజ్‌ బరిలో ఉన్నారు. జనరల్‌ సెక్రటరీ పదవికి పాండవార్‌ జట్టు నుంచి హీరో విశాల్‌ ఈసారి
నిర్మాత గణేశ్‌తో పోటీపడుతున్నారు. కోశాధికారి పదవికి హీరో కార్తీక్‌, హీరో ప్రశాంత్‌ బరిలో ఉన్నారు.

నడిగర్‌ సంఘం ఎన్నికల్లో తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. ముంబయిలో దర్బార్‌ చిత్రం షూటింగ్‌లో ఉన్న ఆయనకు పోస్టల్‌ బ్యాలెట్‌ సరైన సమయంలో అందకపోవడంతో ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీనిపై రజనీకాంత్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నటి, అభ్యర్థి కోవై సరళ స్పందిస్తూ.. అనుకున్న సమయానికే పోస్టల్‌ బ్యాలెట్‌ పంపించారని, కానీ రవాణాలో ఆలస్యమవడంతో రజనీ ఓటేయలేకపోయారని తెలిపారు. ఈ ఎన్నికలకు పోలీసులు బారి భద్రతను ఏర్పాటు చేశారు. విశాల్ – భాగ్యరాజ్ ప్యానెళ్ల మధ్య రసవత్తర పోరు నెలకొంది.