మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టిన వర్మ

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో ఎన్టీఆర్‌ జీవితంలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారాయన. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితాధారంగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ‘టైగర్‌ కేసీఆర్’ అని రాసుంది. బహుశా సినిమా టైటిల్‌ ఇదే అయి ఉండొచ్చు. ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’, ‘ది అగ్రెస్సివ్‌ గాంధీ’ అన్న క్యాప్షన్లు పోస్టర్‌లో దర్శనమిచ్చాయి. ఆంధ్ర ప్రజలు తెలంగాణ వాసులను తక్కువ చేసి చూడడం తట్టుకోలేక కేసీఆర్‌ ఏం చేశారన్న నేపథ్యంలో తీస్తున్న చిత్రమిది అంటూ వర్మ ట్వీట్‌ చేశారు.

మరోవైపు వర్మ ‘కోబ్రా’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు నటుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. భారత నేర చరిత్రలోనే ఎప్పుడూ గుర్తించని అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వర్మ ఇంటిలిజెన్స్‌ అధికారి పాత్రను పోషిస్తున్నారు.