అప్పుడు శివగామి.. ఇప్పుడు మాతంగి!

మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా అత్యద్భుత నటన కనబరిచిన రమ్యకృష్ణ ఇప్పుడు ‘మాతంగి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ దర్శకుడు కన్నన్ తమరక్కులమ్ రూపొందించిన ‘మాతంగి’ చిత్రంలో జయరామ్, సంపత్, అక్షర కిశోర్, ఏంజెలీనా అబ్రహమ్ తో పాటు దేశం గర్వించే నటుడు, స్వర్గీయ ఓంపురి కీలక పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ మలయాళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యమైన విషయం ఏమంటే… వెయ్యి ఎసిసోడ్స్ తో రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారిగా ‘వంశం’ సీరియల్ ను నిర్మించిన రమ్యకృష్ణ సోదరి శ్రీమతి వినయ్ కృష్ణన్ ‘మాతంగి’ చిత్రాన్ని డబ్ చేయబోతున్నారు. రమ్యకృష్ణకు లక్షలాది అభిమానులు ఉన్న తెలుగులో ఈ సినిమా జూన్ మాసంలో రాబోతోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులూ చేయడం జరిగింది. రమ్యకృష్ణతో పాటు ఇందులో ఇద్దరు చిన్నారులు చక్కని నటనను కనబరచడం విశేషం. రితేష్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ కానుంది. రెగ్యులర్ హారర్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటునే విధంగా రూపొందించారు.