బిగ్‌బాస్‌-3 ఆఫర్‌పై క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్


బిగ్‌బాస్-1, 2 సీజన్‌లలో ప్రేక్షకులను టీవీకి కట్టిపడేసిన తెలుగు రియాల్టీ షో తాజాగా సీజన్‌-3 రెడీ అవుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈసారి బిగ్ బాస్-3 ప్రోగ్రాం ద్వారా మంచి రేటింగ్ పొందాలని మాటీవీ నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఈ సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జునను ఫిక్స్‌చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రముఖుల్ని కూడా సంప్రదిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజలకు బాగా తెలిసిన కేఏ పాల్, బండ్ల గణేష్ వంటి ప్రముఖులను సంప్రదించారు. కానీ వాళ్లిద్దరూ బిగ్ బాస్‌కు వచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ షోపై తెలుగు మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి ప్రోగ్రాంను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసిన అనుభవం నాగార్జునకు ఉంది కాబట్టి ఈ షో కోసం నాగ్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం లో సంచలనం కోసం టాలీవుడ్ పవర్ స్టార్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ స్పష్టత ఇచ్చారు. ఈ విషయంలో తనకు చాలా మంది నుంచి సందేశాలు, ఫోన్లు వస్తున్నాయన్నారు. వారందరికీ నేను ఒకటే చెబుతున్నా. బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. అదంతా తప్పుడు ప్రచారమే అని స్పష్టం చేశారు.అయితే బిగ్‌బాస్ షోలో కంటెస్ట్ చేయడం కంటే ఆ షోను హోస్ట్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను. అలాంటి అవకాశం నాకు వస్తే చాలా సంతోషిస్తాను. ఇలాంటి షోను హోస్ట్ చేస్తే ప్రజెంటర్‌గా నా స్కిల్స్ మరింత డెవలప్ చేసుకోవచ్చని భావిస్తున్నానని ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ స్పష్టం చేశారు. స్వతహాగా దర్శకురాలు, రైటర్ అయిన రేణు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.