సినిమా నా ఊపిరి.. దర్శకత్వం నా జీవితలక్ష్యం!

తెలుగు సినిమాలలో సప్తగిరి ఒక నవ్వుల నజరానా.. సప్తగిరి సీన్ లో ఉన్నాడంటే నవ్వులు విరబూయాల్సిందే.. బెదురుతూ.. అదురుతూనే నవ్వులు పండించే సప్తగిరి.. ఇప్పుడు ప్రతి చిత్రంలోనూ నవ్వులకు చిరునామాగా మారిపోయారు. కమెడియన్ స్థాయి నుండి మరోమెట్టు పైకి ఎక్కడానికి ఇప్పుడు హీరోగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంధర్భంగా ఆయనతో కాసిన్ని ముచ్చట్లు.. 
నేపధ్యం.. 
మాది చిత్తురుజిల్లాలోని పుంగనూరు. మానాన్న అటవీశాఖలో హోమ్ గార్డ్. అక్కడే చదువు పూర్తయింది. చదువుకనే రోజుల్లోనే నాకు సినిమాలపై, క్రికెట్ పై మోజు పెరిగింది. క్రికెట్ లో ఆల్ రౌండర్ ని. అలానే చిన్నతనంలో ప్రతి సినిమా చూసేవాడిని. ప్రతి దర్శకుని ప్రతిభను కూడా గమనించేవాడిని. 
డైరెక్టర్ అవ్వాలని వచ్చా.. 
చిత్ర దర్శకుడు కావాలనే కోరిక నాలో బలంగా ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్ కోర్స్ హైదరాబాద్ లోనే ఉందని తెలిసి.. ఇంటర్ పూర్తయిన వెంటనే ఇంట్లో అబద్దం చెప్పి హైదరాబాద్ కు వచ్చేశాను. ఇక్కడకి వచ్చాకా.. చేతిలో డబ్బు లేక తిరిగి ఇంటికి వెళ్ళడం ఇష్టంలేక ఎల్బీనగర్ లో ఒక రూమ్ తీసుకొని కృష్ణగర్ ఏరియాల్లో తిరిగేవాడిని. చిత్రసీమలో కొందరితో పరిచయాలు పెంచుకొని కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాను. ఆ తరువాత బొమ్మరిల్లు సినిమాలో చిన్న వేషం వచ్చింది. కందిరీగ, పరుగు సినిమాల తరువాత ప్రేమ కథా చిత్రం సినిమాలో నటించాను. ఆసినిమాతో లాంగ్ జంప్ కొట్టాను. ఆ సినిమానే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. 
క్యారెక్టర్లు నా జీవితాన్ని మార్చేశాయి.. 
చిత్రసీమలో పని చేయాలనుకున్నాను కానీ ఇలా నటుడిగా నిలబడతాననుకోలేదు. పదేళ్ళ పాటు ఓపికగా సహాయకుడిగా, సహదర్శకుడిగా పనిచేస్తూ.. ఉన్న నాకు అనుకోని రీతిలో దర్శకులు వేయమని చెప్పిన చిన్న చిన్న క్యారెక్టర్లు నా జీవితాన్ని మార్చేశాయి. ఇది నా ఎదుగుదల కాదు.. నా నటనకు తమ గుండెల్లో స్థానమిచ్చి కడుపార నవ్వుకుంటున్న ప్రజలు, ప్రేక్షకులది.. 
అనుకోకుండా వచ్చిన అవకాశమే.. 
కమెడియన్ గా నటిస్తున్న నాకు ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాలో హీరోగా నటించే అవకాశం అనుకోకుండా వచ్చింది. నిర్మాతకు కథ నచ్చడంతో నన్ను హీరోగా ఉండాలని పట్టుబట్టారు. ఈ చిత్రంలో కామెడీ యాక్టర్ గానే కాదు.. అన్నీ కోణాల్లోనూ నన్ను నేను ఆవిష్కరించుకునే అవకాశం వచ్చింది. 
ఏ వేషానికైనా సిద్ధం.. 
ఇప్పుడు హీరోగా సినిమా చేశా కదా అని ఇకా హీరోగానే కంటిన్యూ చేస్తాననుకోకండి. నటుడిగా నేను అన్నీ రకాల పాత్రలు చేయగలనని నిరూపించుకోవడానికి ఈ సినిమాలో నటించాను. భవిష్యత్తులో ఏ వేషంలో నటించడానికైనా.. నేను సిద్ధంగా ఉన్నాను. 
కథలు రాస్తుంటాను.. 
సహాయ దర్శకుడిగా చేసిన అనుభవంతో చాలా కథలు తయారు చేశాను. భవిష్యత్తులో మరింత ఎదగాలని, దర్శకుడిగా పని చేయాలని ఆశగా ఉంది.