శేఖర్‌కమ్ముల నెక్స్ట్‌ సినిమా ఆ హీరోతోనే

‘ఫిదా’ వంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత క్లాస్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల ఏ హీరోతో సినిమా తీస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ హీరో ఇంకెవరో కాదు.. అక్కినేని నాగచైతన్య. ఇటీవల ‘మజిలీ’ తో మంచి విజయాన్ని అందుకున్న చైతూ తన తర్వాతి చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేసేందుకు పచ్చజెండా ఊపారు. ఈ మేరకు చిత్ర బృందం వివరాలు వెల్లడించింది. ‘ఫిదా’తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన భామ సాయిపల్లవి ఇందులో హీరోయిన్‌ గా నటించనుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.