‘బిగ్‌బాస్‌-3’ స్టార్‌ మా అధికార ప్రకటన

తెలుగు బిగ్‌బాస్‌ షో ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తయ్యాయి. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మొదటి అడుగు వేయించగా.. న్యాచురల్‌ స్టార్‌ నాని రెండో అడుగు వేయిస్తూ కాస్త తడబడ్డాడు. అయితే ఈ సారి బిగ్‌బాస్‌ను గతంలో మాదిరి కాకుండా సరైన మార్గంలో నడిపించాలని.. అలాంటి వారి కోసం చాలా మందినే పరిశీలించింది స్టార్‌ మా బృందం. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిన కింగ్‌ నాగార్జున.. బిగ్‌బాస్‌ను మూడో అడుగు వేయించనున్నాడు.

ఈ విషయాన్ని ఇప్పటికే అనధికారికంగా ప్రకటించేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌3 కు నాగ్‌ హోస్ట్‌ అని పలువురు మీడియాముఖంగానే చెప్పారు. అయితే మూడో సీజన్‌ ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం పక్కాగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జూలై మూడోవారం లేదా చివరివారంలో అంటూ ఏదో ఒకటి చెబుతున్నారు. అయితే స్టార​’మా’ బృందం మాత్రం.. బిగ్‌బాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పేసింది. బిగ్‌బాస్‌ సీజన్‌3 త్వరలోనే ప్రారంభంకానుంది.. అని ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈసారి బిగ్‌బాస్‌ మరింత కొత్తగా ఉండబోతోందని ప్రోమోను చూస్తుంటూనే తెలుస్తోంది.

ఇక బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ఉండోబోతోందని, అది కూడా త్వరలోనే ప్రారంభం కానుందని అధికారికంగా తెలిసిపోయింది. ఇక కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారని, కంటెస్టెంట్‌లుగా ఎవరెవరు పాల్గొనబొతున్నారనే విషయాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ షోలో కొంతమంది పాల్గొనబోతున్నారని, దానికి సంబంధించిన ఓ లిస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. టిక్‌టాక్‌ స్టార్లు, యూట్యూబ్‌ స్టార్లు, సింగర్లు, యాంకర్లు ఇలా ప్రతి ఒక్క క్యాటగిరీ నుంచి టాప్‌ సెలబ్రెటీలు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈసారి కామన్‌మ్యాన్‌కు బిగ్‌బాస్‌లో ఎంట్రీ లేదని సమాచారం.