హర్రర్ మూవీతో సుమంత్ అశ్విన్

“హ్యాపీ వెడ్డింగ్‌” సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్‌‌ మరో కొత్త సినిమాతో అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఆయన హీరోగా “దండుపాళ్యం”ఫేం శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. “గరుడవేగ” వంటి హిట్‌ను అందించిన ఎం.కోటేశ్వరరాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ బాణీలు అందించనున్నారు. సరికొత్త కథాంశంతో హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రీకరించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నవంబరు రెండో వారంలో షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. చాలా మంచి కథ. అందుకే నాలుగు భాషల్లో తీస్తున్నాం. సుమంత్ అశ్విన్‌‌ హీరో. ఇతర పాత్రల్లో ప్రముఖ నటులు కనిపిస్తారు. రీ రికార్డింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న హర్రర్ థ్రిల్లర్ ఇది. అందుకే మణిశర్మగారు ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. హర్రర్‌ థ్రిల్లర్స్‌లోనే ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుంది. దండుపాళ్యం 1, 2, 3 చిత్రాల విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో నేను ఈ సినిమాని తీయబోతున్నా. ఎం. కోటేశ్వరరాజుగారు ఈ సినిమాకి నిర్మాత కావడం చాలా సంతోషంగా ఉంది. ఏ మాత్రం రాజీపడకుండా సినిమా తీసే అవకాశం నాకు ఇచ్చారు అని వెల్లడించారు.