సూర్య, జ్యోతిక కుమారుడికి బ్లాక్‌బెల్ట్‌

తమిళ స్టార్స్‌ సూర్య, జ్యోతిక దంపతుల కుమారుడు దేవ్‌ ఇషిన్ ర్యు జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌ గెలిచాడు. తొమ్మిదేళ్లకు కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సాధించాడు. న్యూఢిల్లీలో ఈ పోటీల్ని నిర్వహించారు. తమిళనాడు నుంచి 40 మందికిపైగా పోటీల్లో పాల్గొన్నారు. సూర్య, జ్యోతిక కూడా ఢిల్లీకి వెళ్లి, కుమారుడ్ని ప్రోత్సహించారు. దేవ్‌ ఛాంపియన్‌షిప్‌ అందుకున్న తర్వాత షీల్డ్‌ను తండ్రి సూర్య చేతికి ఇచ్చాడు. 2006లో సూర్య, జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు దేవ్‌, కుమార్తె దియా జన్మించారు.

సూర్య ప్రస్తుతం షూటింగ్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్నారు. ఆయన నటిస్తున్న ‘కాప్పాన్‌’, ‘ఎన్జీకే’ సినిమాల పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ‘ఎన్జీకే’ సినిమా మే 31న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేయబోతున్నారు. ‘కాప్పాన్‌’ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జ్యోతిక మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో జ్యోతిక సోదరుడి పాత్రను కార్తి పోషిస్తున్నారు.