కేరళలో చిరంజీవి ‘సైరా’ చివరి షెడ్యుల్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్‌ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ప్రస్తుతం నటుడు చరణ్‌దీప్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా చిరుతో కలిసి చరణ్‌దీప్‌ దిగిన ఫొటోలు బయటికి వచ్చాయి. చిరుతో కలిసి ప్రయాణిస్తూ, పనిచేయడం అద్భుతమైన అనుభవమని ఈ సందర్భంగా చరణ్‌ అన్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చని తెలిపారు. తనకు సంబంధించినంత వరకు చిరునే రియల్‌ హీరో, లెజెండ్‌ అని కొనియాడారు. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా సినిమా రూపుదిద్దుకుంటోంది. నరసింహారెడ్డి పాత్రలో చిరు, ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటిస్తున్నారు.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌, సుదీప్‌, తమన్నా, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.