టాలీవుడ్‌లో లైంగిక వేధింపులకు చెక్‌ పెట్టనున్న ప్రభుత్వం

టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల పర్వం ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో లైంగిక వేధింపులు ఉన్నా వాటిని ఎవరూ బయట పెట్టకపోవడంతో ప్రజలకు అంతగా తెలిసేది కాదు. ఎందరో జీవితాలను నాశనం చేసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. లైంగిక వేధింపులకు గురైన మహిళలు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. కీచకుల బండారాన్ని బయటపెట్టేందుకు ధైర్యంగా ప్రజల ముందుకొస్తున్నారు. సమాజంలో నెమ్మదిగా అలాంటి బాధిత మహిళలకు ప్రజల మద్దతు లభిస్తోంది. ప్రతి రోజూ ఏదో చోట మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు.

అందంగా కనిపించే సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల పర్వం చాలా ఎక్కువేనని పలువురు బాధితులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి చర్యలు తీసుకోనుంది. దీనికోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ ప్రకటించింది దీనిపై జీవో నెంబర్ 984 విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావును ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక, నిర్మాత సుధాకర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలో సినీనటి సుప్రియ, సినీనటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిని టాలీవుడ్‌ ప్రతినిధులుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మికి కమిటీలో చోటు కల్పించింది.