తెలుగు ‘క్వీన్’ తమన్నా!

బాలీవుడ్ లో వచ్చిన ‘క్వీన్’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో.. అందరికీ తెలిసిందే.. యూత్ ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అదే రేంజ్ లో వసూళ్లను కూడా రాబట్టింది. అప్పటినుండి ఈ చిత్రాన్ని ఇతర బాషల్లో రీమేక్ చేయలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో నటి రేవతి ఈ చిత్రాన్ని తమిళంలో డైరెక్ట్ చేయబోతున్నట్లు త్యాగరాజన్ వెల్లడించారు.

కంగనా రనౌత్ పోషించిన పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేసుకున్నారు. దీంతో తెలుగులో ఆ పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది. తెలుగులో కూడా తమన్నానే తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ వెర్షన్స్ కు సంబంధించి ఆమెతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. తెలుగులో మాత్రం దర్శకుడు రమేశ్ అరవింద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారట’. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది!