‘అరుంధతి-2’ ప్రధాన పాత్రలో హాట్‌ బ్యూటీ

ప్రముఖ నటి అనుష్క హీరోయిన్‌గా.. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘అరుంధతి’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారర్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలోని ‘అరుంధతి’, ‘పశుపతి’ పాత్రలు అనుష్క, సోనూసూద్‌ కెరీర్‌లకు బ్రేక్‌ ఇచ్చాయి. కాగా ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘అరుంధతి 2’ రాబోతోంది. శ్రీ శంఖు చ‌క్ర ఫిల్మ్స్‌ ప‌తాకంపై కోటి తూముల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరోయిన్‌గా పాయ‌ల్ రాజ్‌పుత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం.

భారీ బ‌డ్జెట్‌, గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తీయబోతున్నట్లు నిర్మాత కోటి తూముల చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్‌తోపాటు బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తార‌లు న‌టిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువలైజేష‌న్ గ్రాఫిక‌ల్ వ‌ర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జ‌రుగుతోంది. క‌థాంశంలో భాగంగా పాయ‌ల్ రాజ్‌పుత్ గుర్రపుస్వారీ, క‌త్తి సాముల‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నారు. ఆమెకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ శిక్షణ ఇస్తున్నారు. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు అధికారికంగా వెల్లడిస్తాం’ అని తెలిపారు.