రజనీకాంత్‌పై వర్మ ప్రశంసలు

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ ‘పేట’ సినిమా ట్రైలర్‌లో చాలా అందంగా కనిపించారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ‘పేట’ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో రజనీ స్టైలిష్‌గా కనిపించారు. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ‘పేట ట్రైలర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇండియా‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉంది. ఈ ట్రైలర్‌ను చూసిన వర్మ ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నారు. ‘రజనీ ఒకేఒక్క సూపర్‌స్టార్. ఆయన 20 ఏళ్లు చిన్నవాడిలా.. 30 రెట్లు ఉత్సాహంగా కనిపిస్తున్నారు’ అని వర్మ ప్రశంసించారు.

‘పేట’ సినిమాకు కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తోంది. త్రిష, సిమ్రన్‌ ఇందులో హీరోయిన్‌లు. విజయ్ ‌సేతుపతి, మేఘా ఆకాశ్‌, బాబి సింహా, శశికుమార్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. సెన్సార్‌ బోర్డు ‘యూ/ఏ’ ధ్రువపత్రం ఇచ్చింది. జనవరి 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘పేట’ను వివిధ భాషల్లోనూ విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట.