HomeTelugu Trendingప్రముఖ ఆస్పత్రులతో మంచు విష్ణు ఒప్పందం.. ‘మా’సభ్యులకు రాయితీ

ప్రముఖ ఆస్పత్రులతో మంచు విష్ణు ఒప్పందం.. ‘మా’సభ్యులకు రాయితీ

 

vishnu manchu

‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తన కార్యాచరణ మొదలు పెట్టారు. తన ప్రధాన అజెండాల్లో ఒకటైన ‘మా’ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మూడు నెలలకొకసారి ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఆరోగ్యబీమా క్లెయిం కన్నా ఎక్కువ ఖర్చు అయితే, ఆ బిల్లులో కూడా రాయితీ ఇవ్వన్నట్లు ప్రకటించారు. ప్రతి ఆస్పత్రిలో కేవలం ‘మా’ సభ్యుల కోసమే ఒక సహాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక మహిళా సభ్యులు ఎవరైనా అనారోగ్యం పాలైతే వారి చికిత్స కోసం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించనున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వికల్‌ క్యాన్సర్‌తో బాధపడే మహిళలకు అత్యుత్తమ చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ‘మా’ సభ్యులకు ప్రత్యేకంగా చికిత్స అందించి, బిల్లులో రాయితీలు కల్పిస్తున్న వైద్యులు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి(ఏఐజీ), డాక్టర్‌ భాస్కర్‌రావు(కిమ్స్‌), సంగీత(అపోలో), డాక్టర్‌ సుబ్రమణియం(సీఈవో అపోలో), డాక్టర్‌ గురవారెడ్డి(సన్‌షైన్‌), డాక్టర్‌ అనిల్‌ కృష్ణ(మెడికవర్‌)లను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపామన్నారు. తనతో పాటు డాక్టర్ మాదాల రవి, శివ బాలాజీ కూడా ఉన్నారని వివరించారు. ‘మా’ సభ్యుల ఆరోగ్య పరీక్షలకు అయ్యే ఖర్చులో 50శాతం రాయితీ ఇస్తామన్న టెనెట్‌ డయాగ్నస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ సురేశ్‌, చరణ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

నగరంలోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే నిరంతరంగా సభ్యులు తమ ఆరోగ్యాన్ని ఈ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షించుకోవచ్చని వెల్లడించారు. అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. డిసెంబర్‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!