చలపతి మరోసారి నోరు జారారు!

మొన్నామధ్య ఆడియో ఫంక్షన్ లో చలపతిరావు అమ్మాయిలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. అయితే కేసులు, విమర్శలతో చేసేది లేక లెంపలేసుకున్నాడు. అయితే ఇకపై ఆయన అటువంటి వివాదాలకు దూరంగా ఉంటాడనుకుంటే.. మళ్ళీ అలాంటి వ్యాఖ్యలే చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ఆడపిల్లలు ఈకాలంలో ఫ్యాంటు, టీషర్టులో వేసుకుంటే తప్పని నేను అనడం లేదని.. అమ్మాయిలకు 13-14 ఏళ్లు వచ్చేసరికి ఓణీలు ఇస్తారని అయితే ఆ ఓణీ పర్పస్ ఏంటో తెలుసుకోలేని స్థితిలో ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారన్నారు. ఒక వయసుకు వచ్చేసరికి అమ్మాయిల ఎద కనిపించకుండా ఓణీ ఇస్తారని.. అయితే ఆ ఓణీని తలకు మెడకు చుట్టుకుంటున్నారని ఇలాంటి వారికి ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదన్నారు.

ఒకవేళ ఇది తప్పు అని చెప్పినా.. చాదస్తం అంటారు. అందుకే మనకెందుకులే అని వదిలేస్తున్నాను. అలా అమ్మాయిలు చున్నీ మెడకో, తలకో చుట్టుకుంటే కుర్రాళ్ళు ఏదో అంటారు. అప్పుడు పడాలి లేదంటే గొడవ పెట్టుకోవాలి. గొడవ పడుతూపోతే ఇంక జీవితాంతం దెబ్బలాడాల్సిందే. చీర కట్టుకున్నవాళ్ళను కూడా కామెంట్ చేస్తున్నారు కదా..? అని ప్రశ్నిస్తే.. ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవడైనా ఏమైనా అంటాడు, అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటూ తన వెర్షన్ ను వినిపించారు.