కేజీఎఫ్ 2 కోసం ఆఫర్లను పక్కనపెట్టేసిన శ్రీనిధి

బాహుబలి అంతటి క్రేజ్ తెచ్చుకున్న సినిమా కేజీఎఫ్. ఈ సినిమా సౌత్ లో భారీ వసూళ్లు సాధించింది. అటు బాలీవుడ్ లోను కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ సినిమా ద్వారా హీరో యాష్ కు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ కు కొనసాగింపుగా కేజీఎఫ్ 2 సినిమాను తెరకెక్కిస్తామని గతంలోనే దర్శకుడు నీల్ ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఆడియన్స్ కోసం వేలాదిమంది క్యూలో నిలబడ్డారు అంటే అర్ధం చేసుకోవచ్చు. హీరో యాష్ కు ఎలాంటి పేరు వచ్చిందో హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా అంతే స్థాయిలో పేరు వచ్చింది. కనిపించింది అక్కడక్కడా అయినప్పటికీ… సినిమా హిట్ కావడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. కేజీఎఫ్ తరువాత సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి.

ఇంకో హీరోయిన్ అయితే, వచ్చిన ఆఫర్లను సొంతం చేసుకొని ఈపాటికే నాలుగైదు సినిమాల్లో కనిపించేది. శ్రీనిధి మాత్రం అందుకు విరుద్ధంగా… కేజీఎఫ్ 2 కోసం వచ్చిన ఆఫర్లను పక్కన పెట్టేసింది. పార్ట్ 2 సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటంతో… ఎప్పుడు కాల్షీట్స్ అవసరమౌతాయో అని చెప్పి మిగతా సినిమాలు పక్కనపెట్టింది శ్రీనిధి. మరి కేజీఎఫ్ 2 తరువాత ఇలాంటి ఆఫర్లు వస్తాయా అంటే ఏమో చూద్దాం అని అంటోంది శ్రీనిధి.