నాగచైతన్య, సమంత ‘మజిలీ’ టీజర్‌

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా ‘మజిలీ’ టీజర్‌ వచ్చేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది. ఈరోజు ప్రేమికుల రోజును పురస్కరించుకుని చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ‘నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం’ అంటూ రావు రమేశ్‌ చెప్పే డైలాగ్‌తో, నాగచైతన్య క్రికెట్‌ ఆడుతున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది.

ఈ సినిమాలో నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్‌ ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత నాగచైతన్యకు సమంతతో పెళ్లి జరుగుతుంది. కానీ మొదట ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక చైతూ సమంతను దూరం పెడతాడు. ‘నువ్వు నా రూంలోకి రాగలవేమో కానీ నా జీవితంలోకి రాలేవు’ అంటూ కోపంతో నాగచైతన్య సమంతతో అంటాడు. గోపీ సుందర్ ‌అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.