వైరల్‌ అవుతున్న వీడియో.. ఆగ్రహం వ్యక్తం చేసిన నమ్రత

జొమాటో అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ నటి, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌. విషయం ఏంటంటే గత రెండు రోజులుగా జొమాటోకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ.. జొమాటో డెలివరీ బాయ్‌ ఒకరు కస్టమర్‌ ఆర్డ్‌ర్‌ చేసిన ఫుడ్‌ని కొద్దిగా తిని.. తిరిగి ప్యాక్‌ చేసి డెలివరీ చేశాడు. అయితే సదరు డెలివరీ బాయ్‌ నిర్వాకం అంతా అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. ఇంటర్నెట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జొమాటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కోప్పడిన వారిలో నమ్రత కూడా ఉన్నారు.

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన నమ్రత.. ‘ఇంత పేరున్న ఫుడ్‌ డెలివరీ సంస్థ పనితీరు చూసి నేను చాలా షాక్‌కి గురయ్యాను. ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవారు కనీస శుభ్రతను ఆశిస్తారు. కానీ ఈ వీడియో చూసిన తరువాత ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలంటేనే భయం వేస్తోంది. ఒక వేళ ఆర్డర్‌ చేయాల్సి వచ్చిన ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆర్డర్‌ చేయాలని భావిస్తున్నాను​. నా పిల్లలను ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయనివ్వను.. మీకూ ఇదే చెప్తున్న’ అంటూ కామెంట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను లక్షల మంది చూశారు.