వికీపీడియాలో బాలయ్య మరణం.. అభిమానుల అగ్రహం.!

ఒకప్పుడు మనకు ఏదైనా సమాచరం తెలియకపోతే పెద్దవాళ్లను అడిగి తెలుసుకునేవాళ్లం. కానీ పెరిగిన సాంకేతికత వల్ల ఎవరికి ఏ సమాచారం కావాలన్న అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో ఇట్టే తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా గూగుల్‌, వికీపీడియా అవసరం మరింత పెరిగిపోయింది. అయితే ఈ మధ్య వీటిలో తప్పులు దొర్లడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

తాజాగా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన సమాచారాన్ని వికీపీడియాలో తప్పుగా చూపిస్తోంది. దీంతో బాలయ్య అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిలో బాలయ్య 1913 నవంబర్‌ 2న జన్మించి, 1995 జూలై 19న మరణించినట్లు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌ అవుతోంది. వికీపీడియాలో ఎవరైనా సరే తమకు తెలిసిన విషయాన్ని పంచుకోవచ్చు. ఎవరో ఆకతాయి ఈ పని చేసుంటారని అభిమానులు ఊగిపోతున్నారు. మరి ఈ విషయం బాలయ్య దృష్టికి వెళ్లకముందే.. సరిచేసుకుంటే మంచిది…లేకుంటే వికీపీడియాకు దబిడిదిబిడే.. అంటూ కామెంట్లు చేశారు అభిమానులు. దీంతో వికీపీడియా వెంటనే బాలకృష్ణకు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్‌ చేసేసింది.

భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ గురించి సమాచారాన్ని అడిగితే.. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీని చూపెట్టడం, జవహర్‌లాల్‌ నెహ్రూ అని సమాచారం ఇస్తూ.. నరేంద్రమోదీ ఫోటోను గూగుల్‌ చూపించడం వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అలాగే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చిత్రాన్ని తప్పుగా చూపెట్టింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కుమారుడిని ప్యూన్‌ అని తప్పుగా సమాచారాన్ని అందించింది. ఇలా గూగుల్‌, వికీపీడియాలు తమ విశ్వసనీయతను కోల్పోతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.