రాజకీయాల్లో విమర్శించుకుంటుంటాం.. బన్నీ, త్రివిక్రమ్‌ సినిమాపై పృథ్వీ స్పష్టత

సీనియర్‌ నటుడు పృథ్వీ .. వ్యక్తిగతంగా తనకు, మెగా హీరోలకూ మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ తరఫున మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అది నచ్చక ఆయన్ను అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా నుంచి తొలగించారని ఇటీవల తెగ ప్రచారం జరిగింది. అయితే దీనిపై పృథ్వీ స్పష్టత ఇచ్చారు. అసలు తనను అల్లు అర్జున్‌ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని అన్నారు.

‘నేను గుండుతో ఉన్న కొన్ని ఫొటోల్ని దర్శకుడు త్రివిక్రమ్‌కు పంపా. ఆయన సినిమాలో నాకు సరిపోయే పాత్ర ఉంటే చెప్పమని కోరా. తర్వాత ఆయన నుంచి నాకు ఎటువంటి స్పందనా రాలేదు. ఈ సినిమా విషయంలో దీనికి మించి ఇంకేమీ జరగలేదు’ అని ప్రాజెక్టు గురించి పృథ్వీ చెప్పారు.

అనంతరం రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘రాజకీయాల్లో ఒకరినొకరం విమర్శించుకుంటుంటాం. కానీ, అవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలు కావు. చిత్ర పరిశ్రమపై రాజకీయాల ప్రభావం పడకూడదు. నేను మెగా హీరోలందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటాను. పవన్‌ కల్యాణ్ ‌’అత్తారింటికి దారేది’ సినిమాలోనూ నటించాను’ అని పృథ్వీ పేర్కొన్నారు.

వైసీపీ నుంచి మీరేమైనా ఆశిస్తున్నారా? అని ప్రశ్నించగా.. ‘నేను పదవుల్ని ఆశించి మద్దతు ఇవ్వలేదు. జగన్‌ పాదయాత్ర సమయంలో ఆయన్ను కొన్నిసార్లు కలిశా. ఆయన ప్రజల నాయకుడు. రాష్ట్రానికి మంచి చేస్తారని భావించా.. అందుకే మద్దతు తెలిపా. ఒకవేళ పార్టీ కోసం పనిచేయమని జగన్‌ నన్ను అడిగితే.. దానికి నేను సిద్ధమే’ అని ఆయన తన అభిప్రాయం తెలిపారు.