Homeతెలుగు Newsపెరిగిన ఓటింగ్‌.. ఎవరిని గెలిపిస్తుంది?

పెరిగిన ఓటింగ్‌.. ఎవరిని గెలిపిస్తుంది?

1 9తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో 73.2శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే దానిపై ఎన్నికల నిపుణులు ఏం చెబుతున్నారు? కొత్త రాష్ట్రం వచ్చిన ఉత్సాహంలో కూడా.. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 68 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఈ సారి మాత్రం ఐదు శాతం వరకూ పోలింగ్ పెరిగింది. ఓటింగ్ వైపు ప్రజలను కదిలించిన అంశాలేమిటన్నదానిపై.. రాజకీయ నేతలకే పెద్దగా స్పష్టత లేదు. ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ నేతలు మాత్రం కచ్చితంగా తాను చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటేశారంటున్నారు. తమ ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ మళ్లీ ఈ ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతోనే ఉత్సాహంగా వచ్చి ఓట్లేశారని చెబుతున్నారు. కేటీఆర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే ప్రజాకూటమి నేతలు మాత్రం .. మరో రకంగా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి… ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే వెల్లువగా ఓటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. అదే జరిగిందని చెబుతున్నారు. పెరిగిన ఓట్లు ఎవరికి లాభమన్న అంచనాలు ఎవరూ వేయలేరని.. ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. పోటీ గట్టిగా ఉన్నప్పుడు.. రెండు పార్టీలు హోరాహోరీ తలపడినప్పుడు.. భారీగా పోలింగ్ జరగడం సహజమేనంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగిన వాతావరణమే లేదని… టీఆర్ఎస్ , కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిందని.. అందుకే.. ప్రజలు తాము కోరుకున్న ప్రభుత్వ ఏర్పాటు కోసం ఓటింగ్ లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారని అంటున్నారు.

ఒక రకంగా ఓటింగ్ పెరిగే ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తుందన్న అంచనాలూ ఉన్నాయి. ఇప్పటికే ఉన్న ప్రభుత్వానికి పాజిటివ్‌గా ఉన్నా… పాలక పార్టీ సులువుగా గెలుస్తుందని.. అతి కాన్ఫిడెన్స్ ఉన్నా.. ఆ పార్టీకి చెందిన ఓటర్లు.. ఓటు వేసే విషయంలో కాస్తంత లైట్ తీసుకుంటారు. గెలిచేది మన పార్టీనే కదా.. ఒక్క ఓటు వేయకపోతే ఏమయిందన్న ఫీలింగ్ కి వస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఓటర్లు ఈ తరహాలో లైట్ తీసుకున్నారా.. ఓట్లేశారా అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో తమ క్యాడర్ మొత్తాన్ని ముందుగానే ఎన్నికలకు సిద్ధం చేసుకున్నామంటున్నారు. మరి పెరిగిన పోలింగ్ పర్సంటేజీ ఎవరికి లాభం చేకూరుస్తుందో.. ఎవరికి షాకిస్తుందో పదకొండో తేదీన క్లారిటీ రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu