విజయవాడ అమ్మాయితో ప్రేమలో ఉన్న రాజ్‌ తరుణ్‌

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమౌతున్నానని చెప్పారు. ఇటీవల ట్విటర్‌లో ఓ అభిమాని ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి రాజ్‌ తరుణ్‌ స్పందిస్తూ.. త్వరలోనే జరుగుతుందని అన్నారు. అయితే ఆ అమ్మాయి వివరాల్ని మాత్రం ఆయన బయటపెట్టలేదు. కాగా తాజాగా ఇదే విషయం గురించి రాజ్‌తరుణ్‌ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ఆరేళ్లుగా అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

మేము గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నా ప్రియురాలికి చిత్ర పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేదు. తను విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్త. ఆమె సింపుల్‌గా ఉండే తెలుగింటి అమ్మాయి. తనకు అందరి దృష్టిలో పడటం ఇష్టం లేదు. ఆమె అభిప్రాయాల్ని నేను గౌరవిస్తా. అందుకే పేరు చెప్పడం లేదు. ఈ కారణం వల్లే ఇన్నాళ్లు ఈ విషయాల్ని రహస్యంగా ఉంచాం.

‘ఆరేళ్ల క్రితం వైజాగ్‌లో జరిగిన నా పుట్టినరోజు వేడుకలో ఆ అమ్మాయిని తొలిసారి చూశా. మా అభిరుచులు కలిశాయి. అలా మా ప్రేమకథ మొదలైంది. అప్పటి నుంచి మేం ఒకర్నొకరం ఇష్టపడుతున్నాం. మేం తరచూ కలుస్తుంటాం. ప్రస్తుతం జీవితాంతం ఒకరికొకరం అనే ఫీలింగ్‌లో ఉన్నాం (నవ్వుతూ).

‘మా తల్లిదండ్రులు కూడా పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మా వారితో కూడా తను చాలా రోజులుగా మాట్లాడుతోంది. పెళ్లికి నేను ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. తనే ఆలస్యం చేస్తోంది (నవ్వుతూ). వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం’ అని రాజ్‌ తరుణ్‌ చెప్పారు.

అనంతరం ‘కుమార్‌ 21 ఎఫ్‌’ సినిమాలో ముద్దు సీన్లు ఎక్కువ ఉన్నాయి. ఆమె ఎలా ఫీల్‌ అయ్యారు?’ అని ప్రశ్నించగా.. ‘తనకు నాపై నమ్మకం ఉంది. ఆ సన్నివేశాలు నా వృత్తిలో భాగమని తనకు తెలుసు. నేను కేవలం నటించాను. నేను ఎప్పుడూ మోసం చేయనన్న నమ్మకం తనకుంది’ అని ఆయన సమాధానం తెలిపారు.