‘సరిలేరు నీకెవ్వరు’ ప్రెస్‌మీట్‌

సూపర్‌స్టార్‌ మహేష్బాబు 26వ చిత్రాన్ని ప్రకటించేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించనున్నారు. పూజా కార్యక్రమంతో శుక్రవారం చిత్రీకరణను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు.

ఈ సమావేశంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘సంక్రాంతికి మీ ముందుకు రాబోతున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మహేష్‌ నుంచి మీరు కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్‌ సినిమాలో ఉంటాయని చెప్పగలను. ఇందులో మహేష్‌ ఆర్మీ మేజర్‌ పాత్రలో నటించబోతున్నారు. చాలా మంచి ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారు. ప్రముఖ నటి విజయశాంతి కూడా ఉన్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె ఈ సినిమా ద్వారా మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. స్క్రిప్ట్‌ నచ్చి చేస్తానని వెంటనే ఒప్పుకొన్నారు. అందుకు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను.’ అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘మహేష్‌బాబుతో పాటు ఆయన అభిమానులందరికీ ధన్యవాదాలు. మహేష్‌ సినిమాల్లో ఊర మాస్‌ పాట ఉండాలని అభిమానులు సోషల్‌మీడియాలో మెసేజ్‌లు పెడుతూ ఉంటారు. కానీ ఆయన సినిమాల్లో ఇప్పటివరకు అంతటి ఊరమాస్‌ పాటను పెట్టే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు చెబుతున్నా.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కచ్చితంగా మీరు అడిగిన రీతిలో ఓ మాస్‌ పాట ఉండబోతోంది. మహేష్‌ అభిమానులందరికీ ఇదే నా హామీ’ అన్నారు.

హీరోయిన్‌ రష్మిక మందన మాట్లాడుతూ.. ‘మహేష్‌ సర్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త టీంతో పనిచేయబోతున్నా. చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీ అందరికీ సినిమా నచ్చుతుందని కచ్చితంగా చెప్పగలను. ఇప్పుడే సినిమా గురించి అన్నీ చెప్పలేను. చిత్రీకరణ మొదలయ్యాక చెప్పుకోవాల్సినవి చాలా ఉంటాయి. ధన్యవాదాలు’ అన్నారు.

ప్రెస్‌మీట్‌కు హాజరుకాలేకపోయిన విజయశాంతి ఓ ప్రెస్‌నోట్‌ను రాసి అనిల్‌ రావిపూడికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన దానిని చదివి వినిపించారు. ‘సూపర్‌స్టార్‌ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగులో నా మొదటి సినిమా కృష్ణతో నటించిన ‘ఖిలాడీ’. ఆ తర్వాత 150 సినిమాలు చేశాను. రాజకీయాల్లోకి వెళ్లడంతో 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాను. తొలి సినిమా కృష్ణతో నటిస్తే.. నా రీఎంట్రీలో తొలి సినిమా ఆయన కుమారుడు మహేష్‌ బాబుతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని విజయశాంతి పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates