‘కోటికొకడు’ అనే మాట మనం ఇప్పటికే విన్నాం. అయితే సూర్య మిలియన్‌లో ఒకరని హీరోయిన్ సాయిపల్లవి అన్నారు. వీరిద్దరు భార్యాభర్తలుగా నటించిన సినిమా ‘ఎన్జీకే’. రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారు. సెల్వరాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. శివకుమార్ విజయన్ కెమెరామెన్‌గా పనిచేశారు. మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం చెన్నైలో ఈ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు, సాయిపల్లవి, యువన్ శంకర్ రాజాపై సూర్య ప్రశంసల జల్లు కురిపించారు.
ఇదే వేడుకలో సూర్య వ్యక్తిత్వాన్ని సాయిపల్లవి ప్రత్యేకంగా అభినందించారు. ‘నేను సూర్య సర్‌కు వీరాభిమానిని. సినిమా షూటింగ్‌లో సూర్యను ఎక్కువగా గమనించేదాన్ని. దీంతో ఆయన సెట్‌లో అసౌకర్యంగా ఫీల్ అయ్యి ఉంటారు. షాట్‌కు ఆయన ఎలా సిద్ధమౌతున్నారు, ఆ పాత్రలో ఎలా ఒదిగిపోతున్నారని బాగా గమనించేదాన్ని. సూర్య సెట్‌లోని అందరు టెక్నీషియన్లతోనూ ప్రేమగా మాట్లాడుతుంటారు. వారి కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకుంటుంటారు. ఆయనది ఎంతో మంచి వ్యక్తిత్వం. నేను మరో 20 ఏళ్లు పనిచేసినా.. సూర్య పడ్డ శ్రమలో సగం కూడా చేయలేను. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన మిలియన్‌లో ఒకరు. ఈ ప్రాజెక్టులో నేను నటించడం సంతోషంగా ఉంది. నేను ఓ సీన్ కోసం 50 టేక్‌లు తీసుకున్నప్పటికీ సూర్య విసుగు తెచ్చుకోలేదు, నేను సౌకర్యవంతంగా ఉండేలా ప్రవర్తించారు’ అని సాయిపల్లవి చెప్పారు.













