‘ఎన్టీఆర్‌’ నుంచి మరో రెండు ఆసక్తికరమైన పోస్టర్లు

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న బయోపిక్ ‘ఎన్టీఆర్’ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూవీ టీమ్ ప్రమోషన్లలో ఏమాత్రం తగ్గడం లేదు. వివిధ రకాల గెటప్స్ లో ఉన్న బాలకృష్ణ పోస్టర్లను విశ్రాంతి లేకుండా వదులుతూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అన్నగారి వేషధారణల్లో బాలయ్య వైభవంగా ఉండటంతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది. శుక్రవారం ఆడియోతో పాటు ట్రైలర్‌ విడుదల వేడుకను కూడా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రావణాసురుడి గెటప్‌లో ఎన్టీఆర్‌లా బాలకృష్ణ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఆయన లుక్‌తో పాటు సినిమాలో వివిధ పాత్రల్లో నటిస్తున్నవారి లుక్స్‌ను కూడా ఒకేసారి చూపించారు.

క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్‌, సావిత్రి పాత్రలో నిత్యామేనన్‌, హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్‌, శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’గా ఈ చిత్రం 2019 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పై పోస్టర్‌తో పాటు చిత్రబృందం మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. బసవతారకం హార్మోనియం వాయిస్తుంటే.. పక్కనే కూర్చున్న ఎన్టీఆర్‌ ఆమెను ప్రేమగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.