విక్రమ్ సినిమా మధ్యలోనే ఆగిపోయింది!

విక్రమ్-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో మొదలైన ఈ సినిమా నిర్విరామంగా షూటింగ్ జరుపుతూనే ఉంది. అయితే ఇప్పుడు కథ విషయంలో విక్రమ్-గౌతమ్ ల మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు సమాచారం. షూటింగ్ సగం పూర్తయిన తరువాత గౌతమ్ మీనన్ కథను మార్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా గౌతమ్ మీనన్ ఇలాంటి ప్రయోగాలు చేసిన లిస్ట్ ఉంది. అప్పుడు హీరోలు కూడా ఊరుకున్నారు.
కానీ ఇక్కడ ఉంది విక్రమ్ కావడంతో ఇంకేముంది షూటింగ్ ఆపేశారు. నిజానికి ఈ కథ ఇప్పటిది కాదు.. గౌతమ్ ఈ కథను మహేష్, సూర్య లాంటి స్టార్ హీరోలకు వినిపించాడు. కానీ సెట్ కాలేదు. ఫైనల్ గా సినిమాలో నటించడానికి విక్రమ్ అంగీకరించారు. షూటింగ్ కూడా మొదలయ్యి సగం సినిమా పూర్తయిన తరువాత గౌతమ్ కథను మార్చేయడంతో విక్రమ్ కు కోపమొచ్చి వెంటనే షూటింగ్ నిలిపివేశాడు. ఈ సినిమా కోసం కేటాయించిన కాల్షీట్స్ అన్నీ ‘స్కెచ్’ అనే మరో సినిమాకు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. మరి ఇప్పట్లో ‘ధృవ నక్షత్రం’ సెట్స్ పైకి వస్తుందో.. లేదో.. చూడాలి!