‘అర్జున్ రెడ్డి’కి కొత్త సమస్యలు!

టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన ‘అర్జున్ రెడ్డి’కి ఇప్పుడు ఒకదాని తరువాత మరొక సమస్య ఎదురవుతూనే ఉంది. ఈ సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాల కారణంగా యువత పెడదారి పట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు నిరసనలు చేయడం చర్చనీయాంశం అయింది. తాజాగా మహిళా సంఘాల నుండి కూడా
నిరసనల సెగ తగిలింది. విజయవాడలో అర్జున్ రెడ్డి సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల ఎదుట నిరసనకి దిగిన మహిళా సంఘాలు ఈ సినిమాను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర మహిళల పట్ల ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందని మహిళా సంఘాలు ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఈ నిరసనకు తోడు తాజాగా కాపీ రైట్స్ వివాదంలోను ఈ సినిమా ఇరుక్కుంది. తాను తెరకెక్కించిన ‘ఇక సే లవ్’ అనే చిత్రాన్ని తన అనుమతి లేకుండా కాపీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నాగరాజు అనే దర్శకుడు అర్జున్ రెడ్డి చిత్ర దర్శకనిర్మాతలకు నోటీసులు పంపించారు.