అనసూయకు ‘బేబీ’ వందరెట్లు: సమంత

స్టార్‌ హీరోయిన్‌ సమంత సినీ కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచిన పాత్ర ‘అనసూయ’. ‘అ.. ఆ’ సినిమాలోని ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా వరించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు, బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సమంత సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. తన తర్వాతి సినిమా ‘ఓ బేబీ’ను ఉద్దేశించి మాట్లాడారు. ‘అనసూయకు మూడేళ్లు. దీని తర్వాత ‘ఓ బేబీ’ ద్వారా మరోసారి కామెడీ పాత్రను చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ‘బేబీ’.. అనసూయకు వందరెట్లు కామెడీగా ఉంటుంది. ‘అ..ఆ’ లోని పాత్రకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నాను. అది నా నాలుగో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

‘ఓ బేబీ’ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నాగశౌర్య, రావు రమేశ్‌, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను జులై 5న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.