ప్రభాస్‌ ఇంటి ముందు జపాన్‌ లేడీ ఫ్యాన్స్‌ సందడి.. ఫోటో వైరల్‌

‘బాహుబలి’ మూవీ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ క్రేజ్‌ అంతర్జాతీయంగా వ్యాపించింది. ప్రత్యేకించి జపాన్‌లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది. యూనిట్‌ సభ్యులు కూడా ఆ దేశానికి వెళ్లి అభిమానులతో మాట్లాడి, వారి చిరు కానుకలు తీసుకొచ్చారు. కాగా జపాన్‌కు చెందిన కొంత మంది అమ్మాయిలు తాజాగా ప్రభాస్‌ను కలిసేందుకు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి గేటు ముందు ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్‌ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ఈ సంఘటన తెలుపుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకుడు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆగస్టు 15న చిత్రం విడుదల కాబోతోంది.