భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో!

‘అత్తారింటికి దారేది’ తరువాత ఆ రేంజ్ సక్సెస్ ను అందుకోలేకపోయింది హీరోయిన్ ప్రణీత. ఆ తరువాత అమ్మడుకి తెలుగులో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. ఇంతకీ ఆమె ఇప్పుడు ఏం చేస్తోందో.. తెలుసా..? వ్యాపార కార్యకలాపాలు మొదలుపెట్టిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది . బెంగళూరులో ఫుడ్‌ అండ్‌ బార్‌ ‘బిజినెస్‌ ఛెయిన్‌’ ప్రారంభించిన ప్రణీత, దాన్ని విస్తరించే పనిలో బిజీగా వుంది. తన కుటుంబంలో చాలామంది డాక్టర్లున్నారనీ, తనపైనా
వైద్య వృత్తికి సంబంధించిన ఒత్తిడి వుండేదనీ, అయితే సినిమాలపై ఇష్టం కారణంగా గ్లామర్‌ ప్రపంచంలోకి వచ్చానని చెప్పుకొచ్చింది ప్రణీత.

ఆ మధ్య, ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రణీత ప్రయత్నాలు కూడా చేసింది. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే, ‘ప్రస్తుతానికైతే ఆ స్థాయిలో డబ్బుల్లేవ్‌.. ఇప్పుడు బిజినెస్‌ స్టార్ట్‌ చేశాను గనుక.. ఏమో, భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో..’ అంటూ నవ్వేసింది. తనకు వ్యాపారం మీద పట్టు ఉంది గనుక ఏ బిజినెస్ లో అయినా.. సక్సెస్ ను అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోంది.