HomeTelugu Reviews‘పుష్పక‌విమానం’రివ్యూ

‘పుష్పక‌విమానం’రివ్యూ

Pushpaka vimanam review 1

ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పక‌విమానం’.విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్ర నిర్మాణంలో భాగం కావ‌డంతోపాటు స్వయంగా సినిమాకి ప్రచారం చేయ‌డంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆస‌క్తి పెరిగింది. మ‌రి ఈ న‌యా ‘పుష్పక‌విమానం’ ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థ: చిట్టిలంక సుంద‌ర్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) ప్రభుత్వ స్కూల్‌లో లెక్కల టీచ‌ర్‌. పెళ్లి గురించి ఎన్నెన్నో క‌ల‌లు కంటూ ఉంటాడు. పెద్దల స‌మక్షంలో మీనాక్షి (గీత్ సైనీ)తో పెళ్లి జ‌రుగుతుంది. పెళ్లై ఎనిమిది రోజుల‌వుతుందో లేదో ఆ వెంట‌నే ఆమె లెట‌ర్ రాసి పెట్టి.. ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. పెళ్లాం లేచిపోయిందంటే ప‌రువు పోతుంద‌ని, ఆమె లేక‌పోయినా ఉన్నట్టు న‌టిస్తూ కాలం వెళ్లబుచ్చుతాడు సుంద‌ర్‌. త‌ప్పని ప‌రిస్థితుల్లో ల‌ఘు చిత్రాల్లో న‌టించే రేఖ (శాన్వి మేఘ‌న‌)ని త‌న భార్యగా నటించమని ఇంటికి తీసుకొస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ఇంత‌కీ మీనాక్షి ఎక్కడికి వెళ్లింది? ఆమె మిస్సింగ్ కేసు కోసం ఎస్సై రంగం (సునీల్‌) దర్యాప్తులోకి దిగాక ఎలాంటి నిజాలు తెలిశాయన్నదే మిగ‌తా క‌థ‌.

విశ్లేషణ: అమాయ‌క‌త్వంతో కూడిన ఓ కొత్త జంట చుట్టూ సాగే క‌థ ఇది. చిట్టిలంక సుంద‌ర్, మీనాక్షి పెళ్లితోనే క‌థ మొద‌ల‌వుతుంది. పెళ్లైన వెంట‌నే భార్య ఇంటి నుంచి వెళ్లిపోవ‌డం, ఆ విష‌యాన్ని బ‌య‌టికి చెప్పుకోలేక స‌త‌మ‌త‌మ‌వ‌డం వంటి స‌న్నివేశాల‌తో ఆరంభం ఆస‌క్తిక‌రంగానే సాగుతుంది. హోటల్‌ భోజనాన్ని తీసుకువెళ్లి తన భార్య చేతి వంటగా చెప్పుకొంటూ తోటి ఉపాధ్యాయులకు పెట్టడం, దాన్ని వాళ్లు కనిపెట్టడం, కొత్త కాపురాన్ని చూసేందుకు వాళ్లంతా ఇంటికి రావ‌డం, అక్కడ ఎదురయ్యే ఇబ్బందుల‌తో స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగుతాయి. ముఖ్యంగా యాక్టింగ్ ప్యాష‌న్ ఉన్న అమ్మాయి రేఖ.. సుంద‌ర్ భార్యగా న‌టించిన సన్నివేశాలు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలన్నీ నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రథ‌మార్థంలో హీరో ప‌డే పాట్లన్నీ హాస్యాన్ని పంచుతాయి.

Pushpaka vimanam 1

మీనాక్షి వార్తల్లో క‌నిపించ‌డం నుంచే క‌థ మలుపు తిరుగుతుంది. అప్పటిదాకా కుటుంబ నేప‌థ్యంలో సినిమా సాగిన‌ట్టు అనిపించినా, ఆ త‌ర్వాత నేర ప‌రిశోధ‌న క‌థ‌గా మ‌లుపు తిరుగుతుంది. ద్వితీయార్థంలో ఎస్సై రంగంగా సునీల్‌, ప్రధానోపాధ్యాయుడిగా న‌రేష్ చేసే హంగామా న‌వ్వులు పంచినప్పటికీ చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. క‌థ‌నం అంత‌గా ఆస‌క్తి రేకెత్తించదు. పెళ్లైన కొత్తలో యువ‌తీయువ‌కుల మ‌ధ్య క‌నిపించే గంద‌ర‌గోళం, వాళ్లు చేసే పొర‌పాట్ల గురించి మ‌రింత‌గా చ‌ర్చించే అవ‌కాశం ఉన్నప్పటికీ ద‌ర్శకుడు ఆ విష‌యాలను పైపైనే తేల్చేశారు. స‌ర్దుకుపోవ‌డ‌మే పెళ్లి అని ఓ చిన్న సందేశంతో స‌రిపెట్టేశారు. మొత్తంగా ఓ చిన్న కేస్ స్టడీ త‌ర‌హా క‌థ ఇది.

నటీనటులు: ఆనంద్ దేవ‌ర‌కొండ తన పాత్రకి త‌న‌వంతు న్యాయం చేశారు. ఆ పాత్రలో ఒదిగిపోయిన విధానం ఆక‌ట్టుకున్నా, కామెడీ టైమింగ్ విష‌యంలో మ‌రికాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందనిపిస్తుంది. చాలా స‌న్నివేశాల్లో ఒకే ర‌క‌మైన హావ‌భావాల‌తో కనిపిస్తారు. హీరోయిన్‌లు గీత్ సైనీ, శాన్వి మేఘ‌న పాత్రల‌కి త‌గ్గట్టుగా చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. ముఖ్యంగా శాన్వి మేఘ‌న చేసే అల్లరి, న‌ట‌న‌పై ప్యాష‌న్ ఉన్న అమ్మాయిగా ఆమె క‌నిపించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. పోలీస్ స్టేష‌న్‌లో సునీల్-శాన్విల మధ్య వచ్చే స‌న్నివేశాలు అల‌రిస్తాయి. అమాయ‌క‌త్వంతో కూడిన అమ్మాయిగా గీత్ సైనీ న‌టన మెప్పిస్తుంది. సునీల్‌, న‌రేష్‌, గిరి త‌దిత‌రుల పాత్రలు చ‌క్కటి ప్రాధాన్యంతో క‌నిపిస్తాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నిర్మాణం బాగుంది.

Pushpaka vimanam 2

టైటిల్‌ : పుష్పక విమానం
నటీనటులు : ఆనంద్‌ దేవరకొండ, గీత్‌ సైనీ, శాన్వీ మేఘన, సునీల్‌, నరేశ్‌, హర్థవర్దన్‌ తదితరులు
నిర్మాతలు : గోవర్థన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మిట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి ని

దర్శకత్వం: దామోదర
సంగీతం : రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని

హైలైట్స్‌‌: హాస్యం
డ్రాబ్యాక్స్‌‌: కొన్ని స‌న్నివేశాలు

చివరిగా: పర్వలేదు
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu