మరోసారి జక్కన్నతో ప్రభాస్..?

బాహుబలి వంటి క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందనుందా..? బాహుబలి సినిమా కోసం ఎంతోకాలం పాటు కలిసి పని చేసిన వీరిద్దరూ మరోసారి జతకలవనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా గడుపుతోన్న ప్రభాస్.. ఆ తరువాత రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఇక రాజమౌళి ఇప్పటివరకు తన తదుపరి 
సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్టీఆర్ తో కలిసి పని చేస్తాడని, అలానే ఓ బాలీవుడ్, టాలీవుడ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తాడని ఇలా రకరకాలుగా వార్తలు వినిపించాయి. 
అయితే రాజమౌళి అనుకున్న ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్రభాస్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి 2 సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు కలిసి సినిమా చేయాలనుకున్నారట. దాని కోసం రాజమౌళి ఓ పాయింట్ కూడా అనుకున్నాడని సమాచారం. బాహుబలి2 సెట్స్ లో దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. ప్రభాస్ కు కూడా కాన్సెప్ట్ నచ్చడంతో సినిమా చేద్దామని చెప్పాడట. ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయిన తరువాత ఆ సినిమా కోసం మళ్ళీ కలవనున్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమా తరువాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా రావడానికి సమయం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.