ముంబయిలో బిజీగా ఉన్న రజనీ, ప్రభాస్‌

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌, ‘యంగ్‌ రెబల్‌స్టార్‌’ ప్రభాస్‌లు ముంబయి బిజీబిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారేమో అనుకుంటున్నారా? కాదు. వీరిద్దరూ తమ తర్వాతి చిత్రాల షూటింగ్‌లో భాగంగా ముంబయిలో ఉన్నారు. రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఇందులో రజనీకాంత్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికేవిడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ‘దర్బార్‌’కు సంగీతం అందిస్తున్నారు.

మరో పక్క ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘సాహో’. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్‌ ముంబయిలో జరుగుతోంది. చిత్ర బృందం కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తోంది. విదేశీ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దారు. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌, జాకీ ష్రాఫ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శంకర్‌-ఎషెహన్‌-లాయ్‌లు సంగీతం సమకూరుస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.